: మోదీ ఎంఏ చేసింది నిజమేనా?... వివరాలు తెలుసుకోవాలనుకున్న ఆర్టీఐ కార్యకర్త
పొలిటికల్ సైన్స్ లో తాను ఎంఏ చేశానని ఎన్నికల సమయంలో అఫిడవిట్లలో నేటి ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. 1981-84 మధ్య కాలంలో గుజరాత్ యూనివర్శిటీలో మోదీ మాస్టర్ డిగ్రీ చేశారని బీజేపీ వర్గాలు కూడా చెబుతుంటాయి. అయితే, ఇందులో వాస్తవమెంత? అన్నది నిర్ధారించుకోవాలని ఓ ఆర్టీఐ కార్యకర్త (పేరు బహిర్గతం చేయని వ్యక్తి) ప్రయత్నించాడు. వెంటనే 1981-84 మధ్య మాస్టర్ డిగ్రీలు తీసుకున్న విద్యార్థుల వివరాలు తెలియజేయాలని కోరుతూ గుజరాత్ యూనివర్సిటీకి దరఖాస్తు చేశాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. 2005 నాటి ఆర్టీఐ చట్టం ప్రకారం ఈ వివరాలు వెల్లడించలేము అంటూ సదరు యూనివర్శిటీ నుంచి సమాధానం వచ్చింది. అయితే డైరెక్టుగా ప్రధానమంత్రి మోదీ మాస్టర్ డిగ్రీ వివరాలు కావాలని అడిగితే ఇవ్వకపోవచ్చని, పైగా తనను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో మోదీ చదివిన కాలానికి చెందిన విద్యార్థుల వివరాలు అడిగానని ఆ ఆర్టీఐ కార్యకర్త మీడియాకు తెలిపాడు. గతంలో మోదీ విద్యాభ్యాసం వివరాలు కావాలని ఆర్టీఐ చట్టం కింద మరో కార్యకర్త ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరగా అక్కడ కూడా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.