: ఆర్బీఐ తీరుపై నీతి ఆయోగ్ ఆక్షేపణ!
ఇండియాలో కనీసం అర శాతం నుంచి ఒక శాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గాల్సి వుందని నీతి ఆయోగ్ చైర్మన్, సీనియర్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గించే వీలున్నప్పటికీ, ఆర్బీఐ మిన్నకుందని ఆయన ఆక్షేపించారు. ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే, పరపతి విధానం సరళీకృతం కావాల్సి వుందని అన్నారు. త్వరలో ఆర్బీఐ పరపతి సమీక్ష జరగనున్న నేపథ్యంలో పనగారియా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతకుముందు జరిగిన పాలసీ రివ్యూలో వడ్డీ రేట్లను సవరించని ఆర్బీఐ, ఈ దఫా ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతుండటం పరపతి సమీక్షలో శుభ నిర్ణయాలకు సహకరిస్తుందని తెలుస్తోంది. చైనా భయాలను ఇన్వెస్టర్ల నుంచి దూరం చేయాలంటే వడ్డీ రేట్లను తగ్గించాలని నిన్న మోదీతో సమావేశమైన పారిశ్రామికవేత్తలు సైతం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.