: సోనియాగాంధీ విమర్శలకు మోదీ కౌంటర్
అన్నీ గాలి మాటలు (హవా బాజ్) చెబుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ కౌంటర్ ఇచ్చారు. నల్లధనాన్ని వెనక్కు రప్పించేందుకు తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే 'హవాలా బాజ్' (హవాలా వ్యాపారానికి పాల్పడిన వారు) అడ్డుకుంటోందని విమర్శించారు. ఇతరులను విమర్శించాల్సిన అవసరం తమకు లేదని, తమ లోపాలు సరిచేసుకుంటూ ముందుకు వెళతామని ప్రధాని అన్నారు. భోపాల్ లో 10వ ప్రపంచ హిందీ మహాసభల ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా పాటుపడతామన్నారు. ప్రజలు తమకు పూర్తి మెజారిటీ ఇచ్చారని వారి తీర్పును గౌరవిస్తామని చెప్పారు. నల్లధనాన్ని వెనక్కు రప్పించేందుకు చట్టం చేశామని, దాంతో 'హవాలాబాజ్' ఇబ్బందుల్లో పడ్డారని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారే ఇప్పుడు సమాధానం చెప్పాలని తమను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 2 వరకు భారీ ఎత్తున స్వచ్ఛ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.