: వినాయకచవితికి ఓఎంసీల గిఫ్ట్... మంగళవారం అందుతుంది!
ఆగస్టులో మూడు సార్లు తగ్గిన 'పెట్రో' ఉత్పత్తుల ధరలు ఇంకాస్త దిగిరానున్నాయి. వినాయక చవితి పర్వదినానికి రెండు రోజుల ముందు, 15వ తేదీన సమావేశమయ్యే ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) ప్రతినిధుల సమావేశంలో పెట్రోలు, డీజిల్ తదితరాల ధరలను ఏ మేరకు తగ్గించాలన్న నిర్ణయం వెలువడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే 50 డాలర్ల దిగువన ఉన్న బ్యారల్ క్రూడాయిల్ ధర గురువారం నాడు మరింతగా దిగజారింది. అక్టోబరులో డెలివరీ అయ్యే యూఎస్ బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 65 సెంట్లు పడిపోయి 43.50 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడాయిల్ ధర 76 సెంట్లు తగ్గి 46.82 డాలర్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత క్రూడాయిల్ బాస్కెట్ ధర బ్యారలుకు రూ. 38 తగ్గి రూ. 2,951 (అక్టోబర్ 21న డెలివరీ)గా ఉంది. ఇటీవలి కొన్ని సెషన్లలో క్రూడాయిల్ ధర పెరిగినప్పటికీ, 50 డాలర్లను దాటలేదు. యూఎస్ ఇంధన నివేదిక విడుదలకానున్న తరుణంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అమ్మకాలవైపే ఉందని, ఆ కారణంగానే ధరలు పడిపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.