: ఏపీ మహిళా మంత్రికి నెక్లెస్, పట్టుచీర బహూకరించిన ఉద్యోగులు!
ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రి పీతల సుజాత మరో వివాదంలో ఇరుక్కున్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) ఉద్యోగులు ఆమెకు విలువైన కానుకలు బహూకరించారు. డాలర్ తో కూడిన బంగారు నెక్లెస్, పట్టుచీరను రహస్యంగా ఆమెకు సమర్పించుకున్నట్టు తెలిసింది. కర్నూలు జిల్లాలోని 18 మంది సీడీపీవోలు ఒక్కొక్కరు రూ.5వేల చొప్పున వేసుకుని మొత్తం రూ.90 వేలతో వీటిని కొనుగోలు చేశారట. కర్నూలు జిల్లా అతిథిగృహంలో మంత్రిని కలసి ఉద్యోగులు ఆ కానుకలు సమర్పించుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఫోటో తీయడానికి ప్రయత్నించిన ఫోటోగ్రాఫర్ ను ఉద్యోగులు బయటకు వెళ్లమన్నారట. స్త్రీ శిశు సంక్షేమ శాఖపై జరగనున్న సమీక్ష సమావేశానికి ముందు మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి సీడీపీవోలు ఇలా కానుకలు సమర్పించారని విమర్శలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ శాఖలోని అక్రమాలు మంత్రిగారి సమావేశంలో ప్రస్తావనకు రాకపోవడంపై కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.