: పది లక్షల మందికి నచ్చేసిన సెరీనా విలియమ్స్ బుల్లి అభిమాని!
సెరీనా విలియమ్స్... సమకాలీన టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని రారాణి. 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. ఆమెకున్న అభిమానుల సంఖ్య కోట్లల్లోనే. అయితే, ఆమెను, ఆమెతో పాటు లక్షలాది మందినీ ఆకర్షిస్తోందీ బుడత. నిండా రెండేళ్లు కూడా లేని ఓ పాప తాను సెరీనా విలియమ్స్ లాగా టెన్నిస్ ఆడతానని చెబుతూ, ఆమె చిత్రం ప్రచురించిన మ్యాగజైన్ ను చేతిలో పట్టుకుని వచ్చీరాని మాటలు చెబుతుంటే ఎందరో ముచ్చట పడ్డారు. చేతిలో రాకెట్ లేకుండానే బాల్ ఎలా కొట్టాలో చూపిస్తున్న ఆ ముద్దులొలికే చిన్నారి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండగా, ఇప్పటికే 10 లక్షల మందికి పైగా దీన్ని చూశారు. ఆ పాప తల్లి కింబర్లీ హారిస్ ఈ వీడియోను అప్ లోడ్ చేయగా, దీన్ని చూసిన సెరీనా విలియమ్స్ సైతం ఆనందపడి 'షేర్' చేయడం విశేషం. వీలైతే త్వరలో నా బుల్లి ఫ్యాన్ ను కలుస్తానని కూడా సెరీనా వ్యాఖ్యానించింది.