: ఇక రోజులు లెక్కపెట్టుకో!... కన్నడనాట మరో రచయితకు బెదిరింపులు
కన్నడనాట రచయితలకు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ కవి కాల్ బుర్గీ దారుణ హత్యను మరువకముందే అదే రాష్ట్రానికి చెందిన మరో రచయితకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. కాల్ బుర్గీ స్థాయి రచయిత అయిన కేఎస్ భగవాన్ కు తాజాగా బెదిరింపు లేఖ అందింది. ‘‘ఇప్పటికే ముగ్గురిని హత్య చేశాం. ఇప్పుడిక నీ వంతే. ఏ పోలీసులు కూడా నిన్ను రక్షించలేరు. నీ గడువు ఇప్పటికే మించిపోయింది. ఇక రోజులు లెక్కపెట్టుకో’’ అన్న తీవ్ర వ్యాఖ్యలతో కూడిన బెదిరింపు లేఖ నిన్న భగవాన్ ఇంటికి వచ్చింది. దీనిపై భగవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘బెదిరింపు లేఖ నిన్న మధ్యాహ్నం వచ్చింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. నా కుటుంబ సభ్యులు ఆ లేఖను తీసుకున్నారు. ఆంగ్లంలో రాసిన ఆ లేఖ సారాంశం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం ఆ బెదిరింపు లేఖ పోలీసుల వద్దే ఉంది’’ అని భగవాన్ తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భగవాన్ భగవద్గీతను చులకన చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలుస్తోంది.