: ఇక చంద్రబాబు జిల్లా వంతు... చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు
నవ్యాంధ్రప్రదేశ్ ను భూకంపాల భయం వెంటాడుతూనే ఉంది. నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం దరిమిలా ఉత్తర భారతంతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలకు చెందిన పలు జిల్లాల్లో వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత అంత ఎక్కువగా లేనప్పటికీ ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక కోస్తాంధ్ర, రాయలసీమకు సరిహద్దుగా ఉన్న ప్రకాశం జిల్లాలో తరచూ భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని సోమల మండలం రామకృష్ణాపురంలో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీంతో గ్రామంలోని పలు ఇళ్లు బీటలువారాయి. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.