: ఎన్నారై సిక్కును ‘బిన్ లాడెన్’ అన్న అమెరికా జాత్యహంకారి... ముష్టి ఘాతాలు విసిరిన వైనం


అగ్రరాజ్యం అమెరికా పౌరుల్లో జాత్యహంకార భావం మరింతగా పెరిగిపోతోంది. విదేశాలకు చెందిన ప్రజలు అక్కడ నివసించాలంటేనే బెంబేలెత్తిపోయేలా వారి ప్రవర్తన నానాటికి మితిమీరిపోతోంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఓ సిక్కుపై అమెరికా జాత్యహంకారి దాడికి దిగాడు. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో దాడికి పాల్పడ్డ అమెరికా జాతీయుడు బాధిత సిక్కును ‘బిన్ లాడెన్’ అని అభివర్ణించడం గమనార్హం. ఈ దాడిలో బాధితుడి ముఖంపై ఆరు కుట్లు పడ్డాయి. వివరాల్లోకెళితే... ఇందర్ జిత్ సింగ్ ముక్కెర్ అనే సిక్కు వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డారు. ఇద్దరు కొడుకులున్న ఆయన అక్కడ ఓ గ్రాసరీ షోరూంను నడుపుతున్నారు. మంగళవారం శ్వేత జాతికి చెందిన కొంతమంది వ్యక్తులు ముక్కెర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, యూ బిన్ లాడెన్’’ అంటూ ముక్కెర్ ను సంబోధించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ముక్కెర్ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో స్పృహ కోల్పోయిన ముక్కెర్ కు ఆ తర్వాత ఆసుపత్రిలో వైద్యులు ఆరు కుట్లు వేశారు. ఈ ఘటనపై స్పందించిన అక్కడి సిక్కుల సంఘం చికాగో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆ దేశ పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News