: 'బంగారం డిపాజిట్ స్కీమ్'ను ప్రకటించిన కేంద్రం... విధివిధానాలివే!
ఇకపై బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, పన్ను రహిత ఆదాయాన్ని అందుకోవచ్చు. ఈ దిశగా 'బంగారం డిపాజిట్ స్కీమ్'ను కేంద్రం ప్రకటించింది. బుధవారం నాడు సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 'గోల్డ్ మానిటైజేషన్' స్కీముకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా, 5, 10, 15, 20, 25 గ్రాములు... ఇలా బంగారాన్ని బ్యాంకుల్లో దాచుకోవచ్చు. వీరికి కేంద్రం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లపై వచ్చే వడ్డీ, మూలధన లాభాలపై ఎటువంటి పన్నులనూ చెల్లించనవసరం లేదు. బాండ్లపై వడ్డీని నగదు రూపంలో లేదా గోల్డ్ యూనిట్ల రూపంలో పొందవచ్చు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఈ స్కీము ప్రారంభమవుతుంది. స్కీముపై అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడుతుందని కేంద్రం వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఇండియాలో ప్రజల వద్ద తాకట్టులో లేని బంగారం 20 వేల టన్నుల వరకూ ఉంటుందని అంచనా. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం దీని విలువ దాదాపు రూ. 60 లక్షల కోట్లు. ఈ మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని కేంద్ర ఖజానాకు చేర్చడం ద్వారా దేశాన్ని ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూకించాలన్నది మోదీ అభిమతం.