: అత్యాచారాలను ఐఎస్ఐఎస్ బలమైన ఆయుధంగా వాడుకుంటోంది: హాలీవుడ్ నటి ఏంజెలీనా
ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆగడాలను హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వివరించింది. అత్యాచారాలను కూడా ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా వాడుకుంటున్నారని బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. ఐఎస్ఐఎస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో లైంగిక హింసతో విధ్వంసానికి పాల్పడుతున్నట్టు పేర్కొంది. కనీసం ఏడేళ్ల వయసున్న అమ్మాయిలను కూడా వాళ్లు వదలడం లేదని జోలీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధానంగా జిహాదీ ఛాందసవాదులు చాలా దూకుడుగా ఉన్నారని, వారు అత్యాచారాలను కూడా బలమైన ఆయుధంగా వాడుకుంటున్నారని కమిటీకి వివరించింది. ఇరాక్, సిరియాలు కేంద్రంగా ఐఎస్ఐఎస్ చేసినన్ని ఆగడాలు ఇంతవరకు ఎవరూ చూసి ఉండరని పేర్కొంది. వాళ్లకు అత్యాచారాలు చేయడం ఒక అలవాటుగా మారిపోయిందని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఐఎస్ఐఎస్ సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జోలీ కోరింది. ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తగా జోలీ పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఐఎస్ఐఎస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో పర్యటించిన ఆమె పలు విషయాలను సేకరించింది.