: మీరనుకున్నదే ఎదుటి వారు చేయాలంటే... ఇలా చేస్తే సరి!
మీరు చెప్పే విషయాన్ని ఎదుటివారు వినాలంటే వారికి మీరు బాస్ గా ఉండనవసరం లేదు. మీ మనసులో మాటను ఎదుటివారి నోటి నుంచి రప్పించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న సైకలాజికల్ ట్రిక్స్ తో ఇతరులు మీ దారిలో నడుస్తూ, మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవచ్చు. ఇలా జరగాలంటే ఏం చేయాలి? మీ కోసం కొన్ని టిప్స్... సాయపడాలి: మీ మాటలు ఎవరైతే వినాలని భావిస్తుంటారో, వారి లక్ష్యాలను చేరుకునేందుకు మీరు సహకరిస్తే, వారిలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. వారి పని పూర్తయిన తరువాత 'థ్యాంక్స్' చెబితే, 'ఇట్స్ ఓకే' అనో 'నో ప్రాబ్లమ్' అనో సరిపుచ్చకుండా 'ఫర్వాలేదులే, అంతమాత్రం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా?' అనడం ద్వారా ఎదుటి వ్యక్తి మరింత దగ్గరవుతాడు. మీ దారిలోకి వస్తాడు. ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ని అనుకరించాలి: మీరు ఎవరినైనా త్వరగా ఆకర్షించాలని అనుకుంటే, అతని దారిలోకి మీరు వెళ్లడం అత్యంత సులువైన మార్గం. సదరు వ్యక్తి ఎలా కూర్చున్నాడు?, ఎలా మాట్లాడుతున్నాడు? అన్నది పరిశీలించి, అనుకరించడం ద్వారా సులువుగా పని జరిపించుకోవచ్చు. మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు: మీ ఆలోచనలను ఇతరులకు పంచుకునే దారిలో మరిన్ని కొత్త ఆలోచనలు వచ్చి పని మొదటికి రాకూడదనుకుంటే, చెప్పాల్సిన విషయాన్ని వేగంగా చెప్పాలి. ఎవరైనా మీ ఆలోచనలను అంగీకరించరేమో అనిపిస్తే, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వనంత వేగంగా మాట్లాడాలి. అలసిపోయిన వారు సులువుగా లొంగుతారు: ఎదుటి వ్యక్తులు పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు చెప్పే విషయానికి సులువుగా లొంగుతారు. ఆపై ఇచ్చిన మాట కోసం మీ వెనుక వస్తారు. అదే అలర్ట్ గా ఉన్న సమయంలో ఏదైనా చెబితే పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. మళ్లీ వాటిని నివారిస్తేనే, అతను మీ దారికి వస్తాడు. 'క్రియ'లు బదులు 'నామవాచకాలు' వాడండి: ఓ అధ్యయనం ప్రకారం ప్రజలను రెండు రకాల ప్రశ్నలు అడిగారు. "రేపు జరిగే ఎన్నికల్లో మీ ఓటు ఎంత ముఖ్యం?" అని "రేపు జరిగే ఎన్నికల్లో ఓటరుగా మీరు ఎంత ముఖ్యం?" అని ప్రశ్నించారు. ఓటు ఎంత ముఖ్యం? అని అడిగిన వారికన్నా ఓటరుగా మీరెంత ముఖ్యం? అన్న ప్రశ్న ఎదుర్కొన్న వారిలో అత్యధికులు బ్యాలెట్ బాక్సుల ముందు క్యూ కట్టారు. ఈ తేడాను మీరు గుర్తెరిగి మాట్లాడగలిగితే, ఇతరులు మీ ఆలోచనలతో కలిసొస్తారు.