: తెలంగాణ అనుమతి కోసం ఏపీ అధికారుల ఎదురుచూపులు!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి తెలంగాణ నుంచి సరిహద్దుల సమస్య ఎదురైంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంతో, పవిత్ర కృష్ణమ్మ తీరాన ఉన్న అక్క మహాదేవి గుహలు నాలుగు నెలలుగా చీకట్లో మగ్గిపోతున్నాయి. శ్రీశైలం నుంచి అక్క మహాదేవి గుహలకు వెళ్లే బోట్లకు తెలంగాణ అటవీ అధికారులు అనుమతి ఇవ్వట్లేదు. విభజన తరువాత ఈ గుహలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడమే ఇందుకు కారణం. విషయాన్ని తెలియపరుస్తూ, తెలంగాణ టూరిజం అధికారులకు లేఖ రాయగా, వారు ఏపీకి వచ్చే ఆదాయంలో 21.7 శాతం ఇస్తేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు. దానికి సైతం ఏపీ అధికారులు అంగీకరించినప్పటికీ, అనుమతులు లభించలేదు. వాస్తవానికి శ్రీశైలం నుంచి గుహలకు వెళ్లే భక్తుల నుంచి ఒక్కొక్కరికి రూ. 250 ఏపీ టూరిజం వసూలు చేస్తోంది. దీనిలో రూ. 50 తెలంగాణకు ఇస్తే, బోట్ల నిర్వహణ, ఇంధనం తదితర ఖర్చులు పోగా మిగిలేది నామమాత్రమేనని అధికారులు అంటున్నారు. కాగా, జనసంచారం లేక అక్క మహాదేవి గుహలు గబ్బిలాలు నిండి దుర్వాసన వస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు ప్రభుత్వాల తీరుపై భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.