: మోదీ వచ్చిన తరువాత కుదేలైన అంబానీలు, అదానీల ఆస్తి!
నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) అధికారంలోకి వచ్చిన తరువాత ఇండియాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల సంస్థలు భారీగా నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, కన్స్యూమర్ గూడ్స్ తదితర రంగాల్లోని కంపెనీలు లాభపడగా, సంప్రదాయ భారత ఆర్థిక సామ్రాజ్యాలుగా దశాబ్దాల నుంచి సాగుతున్న మెటల్స్, ఎనర్జీ, పవర్, ఇన్ ఫ్రా రంగాల్లోని కంపెనీలు నష్టపోయాయి. అనిల్ అగర్వాల్ అధీనంలోని 'వేదాంత' అత్యధికంగా నష్టపోగా, ఆపై అదానీలు, అంబానీలు నడిపిస్తున్న సంస్థల ఈక్విటీలు నష్టపోయాయి. మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో... అంటే మే, 2014లో రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అనిల్ అగర్వాల్ సంస్థ వేదాంత విలువ ఇప్పుడు 45 శాతం తగ్గి రూ. 64 వేల కోట్లకు చేరింది. ఈ గ్రూప్ కంపెనీల ఈక్విటీలు భారీగా పడిపోయాయి. దీంతో ఇండియాలో రెండవ అతిపెద్ద ధనవంతుడిగా ఉన్న ఆయన ఐదవ స్థానానికి పడిపోయారు. ఇక గౌతమ్ అదానీ విషయానికి వస్తే, 15 నెలల క్రితం రూ. 76,690 కోట్లుగా ఉన్న ఆయన కంపెనీల విలువ ఇప్పుడు రూ. 49 వేల కోట్లకు తగ్గింది. అదానీ ఎంటర్ ప్రైజస్, అదానీ పవర్ కంపెనీల ఈక్విటీలకు వచ్చిన నష్టమే ఇందుకు కారణం. దేశంలోని ధనవంతుల్లో ముందు నిలిచిన ముఖేష్ అంబానీ సీఎండీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నెట్ వర్త్ రూ. 1.61 లక్షల కోట్ల నుంచి రూ. 1.22 లక్షల కోట్లకు పడిపోయింది. ఆయన సోదరుడు అనిల్ అంబానీ కంపెనీల విలువ రూ. 45,122 కోట్ల నుంచి రూ. 20 వేల కోట్లకు దిగజారగా, ధనవంతుల జాబితాలో టాప్ -20 నుంచి ఆయన వైదొలగారు. టీసీఎస్ అండగా నిలవడంతో టాటా గ్రూప్ మాత్రం కాస్తంత నిలదొక్కుకుంది. ఇదే సమయంలో మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ లాభపడిన కంపెనీల్లో సిద్ధార్థ లాల్ నేతృత్వంలోని ఐచర్ గ్రూప్ (152 శాతం), రూయాలు నడుపుతున్న ఎస్సార్ గ్రూప్ (111 శాతం), దేశ్ బందు గుప్తా అధీనంలోని లుపిన్ (104 శాతం) తదితర కంపెనీలు ఉన్నాయి. నెట్ వర్త్ పరంగా టాప్-20లో ఉన్న కంపెనీలు 10.1 శాతం మేరకు విలువను పెంచుకోగా, కేంద్ర ప్రభుత్వం అధీనంలోని కంపెనీల విలువ 22.5 శాతం తగ్గింది.