: మణిపూర్ లో మండిన పెట్రోల్ ధర...రూ.190 పెడితేనే కాని దొరకని లీటరు పెట్రోలు
ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసరాల ధరలు రెట్టింపు కాగా పెట్రోల్ ధరలు మరింతగా మండిపోతున్నాయి. ఇన్నర్ లైన్ పర్మిట్ విధానం అమలును డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసరాలు, ఇంధనాన్ని సరఫరా చేస్తున్న జాతీయ రహదారులు మూసుకుపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి పూర్తిగా రవాణా స్తంభించిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి సరుకు రవాణా స్తంభించిపోయింది. దీంతోనే ధరలు ఆకాశాన్నంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ లీటరు పెట్రోల్ కావాలంటే ఏకంగా రూ.190 చెల్లించాల్సి వస్తోందని ఆ రాష్ట్ర వాసులు వాపోతున్నారు. ఇక బ్లాక్ మార్కెటింగ్ కూడా జోరందుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.