: నేడు హైదరాబాదులో అడుగుపెట్టనున్న టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్
తెలంగాణ టీడీపీ నేత, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనకు ఘన స్వాగతం పలకడానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఎల్బీనగర్ లో జరిగే కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల సమక్షంలో స్థానిక టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరనున్నారు. ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద ఉన్న రేవంత్ ను తన సొంత నియోజకవర్గం కొడంగల్ దాటి కదలరాదని కోర్టు మొదట్లో షరతు విధించిన సంగతి తెలిసిందే. అయితే, బెయిల్ షరతులలో స్పల్ప మార్పులు చేసిన కోర్టు... రేవంత్ ను కొడంగల్ దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లేలా అనుమతించింది. దీంతో, ఆయన కొడంగల్ నుంచి నేడు హైదరాబాద్ వస్తున్నారు.