: స్నేహాన్ని, మిత్రులను రాజకీయంతో ముడిపెట్టకూడదు: శత్రుఘ్నసిన్హా
బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంచి స్నేహితులు. పార్టీలు వేరైనా వారిద్దరు మాత్రం ఒకటే. ఇటీవల ఓ రెండు సార్లు నితీశ్ ను షాట్ గన్ కలిశాడు కూడా. మరో విషయం ఏమిటంటే.. ఆయన భార్య పూనమ్ సిన్హాను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. అయితే స్నేహాన్ని, మిత్రులను రాజకీయంతో ముడిపెట్టకూడదని శత్రుఘ్న అంటున్నారు. నితీశ్ తనకు మంచి మిత్రుడని, మంచి ముఖ్యమంత్రుల్లో ఆయనొకరని ప్రశంసించారు. కాగా ఆ మధ్య నితీశ్ డీఎన్ఏపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఉద్దేశంతో చేశారని తాను భావించడం లేదని అభిప్రాయపడ్డారు. అయినా ఆ మాటలు అంతగా పట్టించుకోనవసరం లేదని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మోదీ కేబినెట్ లో తనకు చోటు దక్కాలంటే ఒక్క అనుభవం ఉంటేనే సరిపోతుందని తాననుకోవడం లేదని శత్రుఘ్న చెప్పారు.