: భారత సైన్యం చేతికి సరికొత్త ఆయుధం... ధనుష్!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హోవిట్జర్ గన్ 'ధనుష్' త్వరలో సైన్యం అమ్ములపొదిలోకి చేరనుంది. ఏ ప్రాంతానికైనా సులువుగా తీసుకెళ్లగలగడం, శత్రు స్థావరాలపై నిప్పులు కురిపించడం దీని ప్రత్యేకత. ఈ ధనుష్ కు దేశీయ బోఫోర్స్ అనే ముద్దు పేరు కూడా ఉంది. జబల్పూర్ లోని గన్ క్యారేజీ ఫ్యాక్టరీ (జీసీఎఫ్)లో తయారైన ధనుష్, 45 కాలిబర్ 155 ఎంఎం తుపాకీ. పలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి జోడించారు. ఒక్కొక్క ధనుష్ తయారీకి రూ. 14 కోట్లు వ్యయమైందని జీసీఎఫ్ జనరల్ ఎన్ కే సిన్హా వివరించారు. నవంబర్ లో దీన్ని సైన్యానికి అందించనున్నట్టు వివరించారు. ఎలక్ట్రానిక్ విధానంలో లక్ష్యాలకు గురిపెట్టడం, శత్రువుల టెక్ వ్యవస్థలను గుర్తించడం తదితర సదుపాయాలు ఉంటాయని వివరించారు. బోఫోర్స్ గన్ తో పోలిస్తే అదనంగా 11 కిలోమీటర్ల దూరం వరకూ లక్ష్యాలను ఛేదించవచ్చని తెలిపారు. బోఫోర్స్ ఒప్పందంలో భాగంగా తొలి విడత భారత్ కు అందిన 12000 పేజిలకు పైగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, కోల్‌కతాకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఈ ధనుష్ తుపాకీని తయారుచేసింది.