: మద్యం మానేసిండ్రు... మంచం పట్టిండ్రు: ఆదిలాబాదు జిల్లాలో వింత పరిస్థితి!


నిజమేనండోయ్, ఆదిలాబాదు జిల్లా భైంసా పరిధిలోని కామోల్ అనే గ్రామంలో వింత చోటుచేసుకుంది. మద్యపానం శ్రుతిమించితే మంచం పట్టడం చూశాం కాని, మద్యపానం మానితే కూడా మంచం పట్టడం మాత్రం ఇక్కడే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ పేరిట గ్రామాల్లోకి చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు గ్రామాలు చీప్ లిక్కరే కాదు, అసలు లిక్కరే మాకొద్దంటూ ఏకంగా తీర్మానాలు చేసేశాయి. ఇలా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించుకున్న గ్రామాల్లో కామోల్ కూడా ఒకటి. మొన్న శ్రీకృష్ణాష్టమి నాడు గ్రామస్తులంతా మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచే గ్రామంలోని మందుబాబులు అంతా మద్యం మానేశారు. ఇంకేముంది, నాలుగైదు రోజులు గడిచాయో, లేదో మద్యం మానేసిన మందుబాబుల్లో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. మరునాడు మరో 20 మందికి అస్వస్థత, వీరూ ఆసుపత్రి బాట పట్టక తప్పలేదు. ఇలా గ్రామంలో వంద మందికి పైగా మందుబాబులు మంచం పట్టడంతో వైద్య సిబ్బంది గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం స్థాయిని మించి మందుబాబులు అనారోగ్యానికి గురి కావడంతో భైంసా ఆసుపత్రికి వారిని తరలించారు. అక్కడ బెడ్లు చాలక కింద పడుకోబెట్టి మరీ చికిత్స అందిస్తున్నారు. అసలు మద్యపానం మానేసిన మందుబాబులు అనారోగ్యానికి ఎందుకు గురయ్యారంటే... ఏళ్లుగా అలవాటున్న మద్యపానాన్ని ఒక్కసారిగా వదిలేయడంతో వారిలో నరాలు పట్టుతప్పాయట. శరీరంలో నీటి శాతం తగ్గిపోయిందట. మద్యపానాన్ని ఒక్కసారిగా వదిలేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తడం సాధారణమేనని భైంసా ఆసుపత్రి వైద్యుడు కాశీనాథ్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News