: కువైట్ లో కూర్చొని సిరియాలోని తీవ్రవాదులను మట్టుబెట్టారు!
కువైట్ లో కూర్చొని సిరియాలోని మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వర్గాలు మట్టుబెట్టిన ఘటన సంచలనం కలిగిస్తోంది. బ్రిటన్ లో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు రియాద్ ఖాన్, రాహుల్ అమీన్ లు ఓ వాహనంలో రక్కా నగరానికి వెళ్తున్నట్టు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో కువైట్ లో ఉన్న తమ బృందాన్ని అప్రమత్తం చేసింది. రీపర్ అనే డ్రోన్ ను సిరియా పంపింది. 86 అడుగుల రెక్కలు, 36 అడుగుల పొడవైన ఈ డ్రోన్ 300 మైళ్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంది. అత్యాధునిక కెమెరాలున్న రీపర్ తీవ్రవాదుల ట్రక్కు కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తూ లేజర్ గైడెడ్ క్షిపణిని ప్రయోగించింది. అంతే క్షణాల్లో తీవ్రవాదులు ప్రయాణిస్తున్న ట్రక్కు తునాతునకలైంది. లక్ష్యం పూర్తి చేసిన రీపర్ వెనుదిరింది. టెర్రరిస్టులను హతమార్చడం రాయల్ ఎయిర్ పోర్స్ (రాఫ్) కు కొత్త కాదు. కానీ సిరియాలో రాత్రి పూట ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం మాత్రం తొలిసారి. రీపర్ డ్రోన్ ఖరీదు 100 కోట్ల రూపాయలు. అత్యాధునిక కెమెరాలు, రాడార్ వ్యవస్థ రీపర్ సొంతం. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించడం రీపర్ ప్రత్యేకత. అంతే కాదు, ఒకసారి ఇంధనం నింపితే పేలోడ్ లేకుండా 30 గంటలు, పేలోడ్ తో 14 గంటల పాటు, గంటకు 300 మైళ్ల వేగంతో నిర్విరామంగా ప్రయాణించడం దీని ప్రత్యేకత.