: పోకిరీలపై బాలిక పిడిగుద్దులు
అమ్మాయి ఒక్కతే వెళ్తోంది.. అదీ చీకటిపడ్డ సమయంలో.. ఆటపట్టిద్దామనుకున్నారు ఇద్దరు తాగుబోతులు. ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను తాకబోయారు, అంతే ! వారి ముఖాలు పచ్చడయిపోయాయి. దెబ్బకు సైకిల్ పై అక్కడి నుంచి జారుకున్నారు. ఆ అమ్మాయి అంత ధైర్యంగా వారిపై పిడిగుద్దులు కురిపించడానికి ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందంటే, ఆమె నేర్చుకున్న కరాటే నుంచి అనే చెప్పాలి. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా శివారు గ్రామం మధ్యమ్ గ్రామ్ లో జరిగింది. కరాటే క్లాసు ముగించుకున్న 16 సంవత్సరాల బాలిక ఇంటికి వెళ్తోంది. అటుగా సైకిల్ పై వస్తున్న తాగుబోతు ఆకతాయిలు, బాలిక వద్ద ఆగారు. బాలికను పట్టుకునేందుకు యత్నించడంతో రెండే రెండు పంచ్ లు చెరొకటి ఇచ్చింది. అయినా వాళ్లు తగ్గలేదు. మళ్లీ అదే ప్రయత్నం చేశారు. ఇంకొంచెం బలంగా మళ్లీ రెండు పంచ్ లు. ముఖాల షేప్ మారి, గాయాలపాలయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. తల్లిదండ్రులు వద్దంటున్నా, ఇష్టపడి కరాటే నేర్చుకున్న ఆ బాలిక ఇప్పుడు ఎంతో గర్వంగా ఫీలవుతోంది.