: ముంబయిలో మాంసం అమ్మకాల నిషేధంపై విమర్శలు
ముంబయిలో మాంసం అమ్మకాల నిషేధంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైన్ మతస్థుల పర్యూషన్ ఉపవాసాల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ పౌర సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది. సంస్థ ప్రకటనపై ముంబయిలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. చివరకు, శివసేన పార్టీ కూడా విమర్శలు చేసింది. పౌర సంస్థ ప్రకటన మత ఉగ్రవాదానికి నిదర్శనమంటూ శివసేనకు చెందిన సంజయ్ రౌత్ ఆగ్రహించారు. థానే జిల్లాలో కూడా సెప్టెంబర్ 11 నుంచి 18వ తేదీ వరకు మాంసం అమ్మకాలు నిషేధించాలంటూ పౌర సంస్థ ప్రకటించిన కొద్ది రోజుల అనంతరం బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ అజో మెహతా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 10, 13, 17, 18 తేదీలలో ముంబయిలో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, కొన్ని సంవత్సరాలుగా ఇది అమలులో ఉందని పౌర శాఖకు సంబంధించిన అధికారులు వివరించారు.