: ఆమె విషయంలో చైనా ఏం చేస్తుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు!
నిన్నటి వరకు స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడి ఎలా వెనక్కు తీసుకోవాలా? అంటూ చైనాలో చర్చోపచర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళ గురించి చైనా మొత్తం ఆసక్తిగా చర్చించుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే... చెన్ అనే మహిళ రెండోసారి గర్భం దాల్చింది. చైనాలో పిల్లల విషయంలో 'ఒకరే హద్దు లేదా అసలే వద్దు' అనే నినాదం పాటిస్తున్నారు. ఈమధ్య కాలంలో రెండో బిడ్డ కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం దిగి వస్తుందిలే అని భావించిన చెన్ రెండో బిడ్డ కోసం గర్భం దాల్చింది. అయితే చైనా ప్రభుత్వం నిబంధనలు సడలించలేదు. దీంతో చెన్ రెండో బిడ్డను కంటే కనుక, ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగం ఊడుతుంది. పోనీ గర్భం తొలగించుకుందామా? అంటే ఎనిమిదో నెల... అబార్షన్ కు వీలు కాదు. దీంతో ఆ దంపతులు ఆందోళనలో పడ్డారు. వీరిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోని అధికారులను పలువురు వారి భవిష్యత్ పై ఆరాతీస్తున్నారట. కాగా, రెండో బిడ్డ కారణంగా ఆమె భర్త ప్రభుత్వోద్యోగం వదులుకోవాల్సి వస్తే, అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్థానిక సంస్థ ఆఫర్ ఇచ్చింది. దీంతో వీరిపై చైనాలో చర్చ నడుస్తోంది.