: ప్రధాని మోదీకి సవాల్ గా మారిన హార్దిక్ పటేల్ : న్యూయార్క్ టైమ్స్
గుజరాత్ రాష్ట్రంలోని పటేళ్ల యువనేత హార్దిక్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద సవాల్ గా మారారని మంగళవారం నాడు న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ రాసింది. భారత దేశంలో ఎక్కువ జనాభా ఉన్న కులం పటేళ్లు. ఈ కులస్థులు తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనలు చేపట్టారు. సంస్కరణలకు సంబంధించి ఎన్నో ప్రణాళికలతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి పటేళ్ల రిజర్వేషన్ల సమస్య పెద్ద సవాల్ అని, వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తారా? అంటూ ఎడిటోరియల్ లో రాసుకొచ్చారు. 'ఇండియాస్ మిడిల్ క్లాస్ రివోల్ట్' పేరుతో ప్రచురితమైన ఈ ఎడిటోరియల్ లో చాలా విషయాలను ప్రస్తావించారు. హామీలతో తన పొలిటికల్ కెరీర్ ను నిర్మించుకున్న నరేంద్ర మోదీ, నూతన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను దారిలో పెడతానని నాడు చెప్పారన్నారు. ఇటీవల నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో లక్షల మంది పటేళ్లు నిర్వహించిన ర్యాలీలో ప్రస్తుత ఆర్థిక విధానాలపై వారు మండిపడ్డారని రాశారు. 120 కోట్ల భారత జనాభాలో సగం మంది 25 సంవత్సరాల లోపు వయస్సు వారే. కనుక, మరిన్ని ఉద్యోగాల సృష్టీకరణ అవసరం చాలా ఉందని ఆ ఎడిటోరియల్ లో అభిప్రాయం వ్యక్తం చేశారు.