: ఒక ఇంట్లో నాలుగు పదవులున్నప్పుడు... ఒక జిల్లాకు 2 నదుల నీళ్లివ్వడంలో తప్పేంటి?: సబిత
ప్రాణహిత ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తప్పిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ వరకు 620 కిలో మీటర్లు వస్తున్న ప్రాణహితను 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డికి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ప్రాజెక్ట్ డిజైన్ ను మార్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్న సబిత, సిద్ధిపేట, గజ్వేల్ చెరువులను నింపుకోవడానికే రంగారెడ్డి జిల్లాను బలిచేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఇంట్లో నాలుగు పదవులున్నప్పుడు, ఒక జిల్లాకు 2 నదుల నీళ్లివ్వడంలో తప్పేంటని సూటిగా ప్రశ్నించారు. సబిత ఈ రోజు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ను కలిశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో కాంగ్రెస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. జంటనగరాలకు కృష్ణా, గోదావరి నీళ్లు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డులు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ది కాదా? అని అడిగారు. తామేం (కాంగ్రెస్) చేశామో చర్చించడానికి మంత్రి హరీష్ సిద్ధమా? అని ప్రశ్నించారు.