: బేరం చేయడంలో భారతీయులే బెస్ట్... ఎందుకో తెలుసా?


ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే బేరమాడటం భారతీయుల నైజం. పావు కిలో కూరగాయల నుంచి, కారు వరకూ... ఏది కొనాలని వెళ్లినా, దాని ధర ఎంతో కొంత తగ్గాలని కోరుకుంటాం. డిస్కౌంట్లేమున్నాయి? ఉచితంగా ఏం లభిస్తుందో తెలుసుకుంటేగాని ముందడుగు వేయం. భారతీయుల మనసు ఈ తరహా 'డీల్స్'కే దగ్గరవుతుంది. అదే ఇండియన్స్ ను బేరమాడటంలో మిగతా దేశస్తులతో పోలిస్తే ముందు నిలిపింది. మనం బేరం విషయంలో బెస్ట్ అని చెప్పడానికి 10 రీజన్స్ ఇవి. 1. డిస్కౌంట్ సీజన్ ఎప్పుడు ఉంటుందన్నది మనకు తెలుసు. వారంలో ఆఫర్లు ఎప్పుడు ఉంటాయి? ఏ బ్రాండ్లపై ఏ ఆఫర్ ఉందన్నది తెలుసుకున్నాకే షాపులోకి ప్రవేశిస్తాం. 2. ఏ వస్తువునూ అధిక ధర పెట్టి కొనేందుకు మనం ఇష్టపడం. కొనాలనుకున్న ప్రొడక్టు ధర ఎక్కడెంత వుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అది కంది పప్పు అయినా సరే, స్మార్ట్ ఫోన్ అయినా సరే. 3. ఉచితంగా మరో వస్తువు వస్తుందని తెలిస్తే, అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. ఓ వస్తువుకు మరో వస్తువు ఉచితమని తెలిస్తే, అది అవసరం లేకపోయినా సొంతం చేసుకునేందుకే ప్రయత్నిస్తాం. 4. డిస్కౌంట్ కూపన్లు మనకు బెస్ట్ ఫ్రెండ్స్. ఆన్ లైన్లో డిస్కౌంట్ కూపన్ ను వాడకుండా వస్తువును కొనేందుకు ఎంతమాత్రమూ ముందడుగు వేయం. 5. చిన్న చిన్న విషయాల్లో పట్టు వీడం. ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టం. అందుకే దుకాణదారు కూడా బేరం విషయంలో ప్రోత్సహించేందుకే యత్నిస్తాడు. 6. సరసమైన ధరలకు వస్తువులు వస్తున్నాయని మనసులో ముద్ర పడితే చాలు, పదేపదే అదే షాపుకు వెళ్తాం. దీని వల్ల అక్కడి వ్యక్తులు పరిచయమవుతారు. ఓపికగా మనం కోరుకునే వస్తువులు చూపి, వాటి గురించి వివరిస్తారు. మనం కూడా సులువుగా బేరమాడతాం. 7. ఏదైనా మాల్ కు వెళ్లాలంటే, అక్కడ లభించే ఆఫర్లు, డీల్స్ గురించి పేపర్లలో వచ్చిన తాజా ప్రకటనలను పరిశీలిస్తాం. మాల్ కు వెళ్లిన తరువాత, ముందు చూసిన ఆఫర్ లేకుంటే, అక్కడి ఉద్యోగులను ప్రశ్నిస్తాం కూడా. 8. భారతీయులు బేరంలో బెస్ట్ కాబట్టే... పలు బ్రాండ్ల నుంచి ఈ-మెయిల్ ఖాతాలకు కుప్పలుకుప్పలుగా ఆఫర్లు వస్తుంటాయి. సరాసరిన 70 శాతం ఈ-మెయిల్స్ ఇటువంటివే ఉంటాయట. 9. ఓ ఖరీదైన వస్తువును కొనేముందు దాన్ని గతంలో వాడిన వారి అభిప్రాయాలు తీసుకుంటాం. దానికి పెట్టే ఖరీదుకు తగ్గ లాభముందా? లేదా? అని పరిశీలిస్తాం. 10. బేరం చేసే సమయంలో ఎవరైనా చూస్తున్నట్టు అనిపిస్తే, మరింత సమర్థవంతంగా, గట్టిగా బేరం చేయాలని చూస్తాం. ఇక, చివరిగా మీ మిత్రులు మిమ్మల్ని షాపింగ్ కు తోడుగా రావాలని పిలిచారంటే, మీరు బేరం చేయడంలో బెస్ట్ అని వారు భావిస్తున్నట్టే. మీ ఫ్రెండ్స్ చేసే షాపింగులకు మీరు ఎంత ఎక్కువగా వెళుతుంటే, అంత బేరమాడే పవర్ మీ సొంతమని లెక్క!

  • Loading...

More Telugu News