: ఇండియాలో అత్యంత దానకర్ణులు వీరే!


ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత ఉదారవాదుల జాబితాలో ఆసియా పసిఫిక్ కు చెందిన 13 మందికి స్థానం లభించగా, అందులో ఏడుగురు భారతీయులు ఉండటం గమనార్హం. దానగుణం కలిగుండి, తమ సంపదలో అత్యధిక భాగాన్ని వితరణ చేసిన వీరిలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి ముందు నిలిచారు. ఈయన తరువాత కేరళలో జన్మించిన ఔత్సాహిక వ్యాపారవేత్త సన్నీ వర్కీకి స్థానం లభించింది. వర్కీ గత జూన్ లో తన సంపదలో సగభాగాన్ని, అంటే 2.25 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 14,500 కోట్లు) బిల్ గేట్స్, వారన్ బఫెట్ దారిలో నడుస్తూ, వితరణ చేశారు. 14 దేశాల్లో 70కి పైగా ప్రైవేటు స్కూళ్లను నిర్వహిస్తున్న జమ్స్ ఎడ్యుకేషన్ కు వర్కీ అధినేత. వీరితో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో ఎనలేని సేవలందిస్తున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు సేనాపథి గోపాలకృష్ణన్, నందన్ నిలేకని, ఎస్డీ శిబూలాల్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో కొత్తగా చేరిన వారిలో నారాయణమూర్తి కుమారుడు రోహన్ కూడా ఉన్నారు. పురాతన భారతీయ గ్రంథాలను భవిష్యత్ తరాలకు అందించే నిమిత్తం హార్వార్డ్ ప్రెస్ కు రోహన్ 5.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 343 కోట్లు) సహాయంగా అందించారు. విట్ కాంబ్ అండ్ షఫ్తేస్ బురీ టైలర్స్ సంస్థను లండన్ లో నిర్వహిస్తున్న ఇద్దరు భారత సంతతి సోదరులు సురేష్ రామకృష్ణన్, మహేష్ రామకృష్ణన్ లు కూడా ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు. వీరు ఇండియాలో 4 వేల మంది టైలర్లకు అధునాతన యంత్రాల కొనుగోలుకు ధన సహాయం చేయడంతో పాటు 2004 సునామీ బాధితులను ఆదుకునేందుకు ముందు నిలిచారని ఫోర్బ్స్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News