: మోదీ ప్రభుత్వంపై ‘కేజ్రీ’ పార్టీ ధ్వజం... తన ఎంపీల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపణ
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై ఢిల్లీలో పాలనా పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ధ్వజమెత్తింది. తమ పార్టీ ఎంపీల ఫోన్లను బీజేపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ విషయంలో బీజేపీపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. దీనిపై తప్పనిసరిగా సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ పదవీ ప్రమాణం చేయడానికి ఒకరోజు ముందు పంజాబ్ లో ఆప్ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించిన భగవంత్ మన్, ధరంవీర్ గాంధీలు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ధరంవీర్ ను ఆప్ సస్పెండ్ చేసింది. తమ పార్టీ ఎంపీలను బీజేపీ తనవైపు తిప్పుకునేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఫోన్ సంభాషణలు వెలుగుచూశాయని ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్ పాయ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.