: ప్రియురాలి కోసం... ప్రేమించిన భార్యను కడతేర్చిన కసాయి!
సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించి, పెళ్లాడాడు. ఓ బిడ్డను కన్నాడు. ఆమెతో గొడవలు వచ్చాక, చిన్ననాటి స్నేహితురాలు, వివాహితతో స్నేహం పెంచుకున్నాడు. ఆమెను దక్కించుకోవడం కోసం, ఆమె భర్త పేరిట విమానాల్లో బాంబులున్నాయని ఫేక్ మెసేజ్ లు పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కేరళకు చెందిన ఎంజీ గోకుల్ (37) ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో, ఫేస్ బుక్ ద్వారా అనూరాధ అనే యువతిని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఒక కుమార్తె. గోకుల్ ను బెంగళూరుకు బదిలీ చేయడంతో, అనురాధ అక్కడికి రాలేనని తేల్చేసింది. దీంతో, ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంగళూరులోనే ఉంటున్న గోకుల్ కు తన చిన్ననాటి స్నేహితురాలు శిజు జోష్ కనిపించింది. ఆమెకు దగ్గరయ్యాడు. తన భర్తను వదిలి వచ్చేందుకు శిజు ఇష్టపడకపోవడంతో గోకుల్ కుట్ర చేశాడు. అతని పాస్ పోర్టు జిరాక్స్ సంపాదించి నకిలీ సిమ్ తీసుకున్నాడు. ఆ సిమ్ వాడి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులకు 'వాట్సప్' ద్వారా తప్పుడు బెదిరింపు సందేశాలు పంపాడు. విమానాల్లో బాంబులున్నాయని తెలిపాడు. ఇది అసత్యమని నిర్ధారించుకున్న బెంగళూరు నేర నియంత్రణ విభాగం (సీసీబీ) విచారణ మొదలు పెట్టి, ఇదంతా గోకుల్ పనేనని తేల్చింది. విచారిస్తే, గోకుల్ చేసిన మరో భయంకర దారుణం వెలుగుచూసింది. జులై 28న తన భార్య అనురాధ చేత మద్యం తాగించి, బలమైన వస్తువుతో కొట్టి చంపేశాడు. ఆపై తలకు దెబ్బ తగిలి చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇప్పుడా కేసును తిరగదోడే పనిలో పోలీసులు ఉన్నారు.