: భూ వివాదంపై టీ సర్కారు కొరడా... డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్


విలువైన ప్రభుత్వ భూములను కాపాడుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై కేసులు పెట్టేందుకే కాక అరెస్ట్ లకూ వెనుకాడబోమని తేల్చిచెప్పింది. ఈ దిశగా ప్రభుత్వం నిన్న కొరడా ఝుళిపించింది. అక్రమంగా విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన ఓ ఉన్నతాధికారిని అరెస్ట్ చేసింది. తద్వారా ఇకపై భూ వివాదాలపై మీనమేషాలు లెక్కించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకెళితే... రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తుర్కయాంజాల్ పరిధిలోని పదెకరాల భూమిని లింగయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుడికి 2005-06లో అప్పటి తహశీల్దార్ రామచంద్రయ్య రాసిచ్చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం నియమించిన ఎస్కే సిన్హా కమిటీ అక్రమాలు నిజమేనని తేల్చింది. సంబంధిత అధికారులపై చర్యలకు ప్రతిపాదిస్తూ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీనిపై వేగంగా స్పందించిన ప్రభుత్వం కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ రఘునందన్ రావు నిన్న ఈ వివాదంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. కలెక్టర్ తరఫున కలెక్టరేట్ పరిపాలనాధికారి చేసిన ఫిర్యాదు అందుకున్న వనస్థలిపురం పోలీసులు నాడు హయత్ నగర్ మండలం తహశీల్దార్ గా పనిచేసి, ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న రామచంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News