: బంగ్లాదేశ్ క్రికెటర్ కోసం పోలీసుల వేట
బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన ఇంట్లో పని చేస్తున్న 11 ఏళ్ల బాలికను హహదత్, ఆయన భార్య చితకబాదారని వారిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, నిన్న ఢాకాలోని ఓ వీధిలో గాయాలతో ఉన్న 11 ఏళ్ల బాలిక ఏడుస్తూ పోలీసులకు కనిపించింది. ఆ అమ్మాయి కంటి వద్ద, ఇతర చోట్ల గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ అమ్మాయి నుంచి వివరాలు సేకరించిన తర్వాత షహదత్, ఆయన భార్యపై కేసు బుక్ చేశారు. వెంటనే షహదత్ ఇంటికి వెళ్లారు. అయితే షహదత్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ ఉదయం నుంచి కూడా షహదత్ కోసం పోలీసులు అన్వేషిస్తూనే ఉన్నారు. 29 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ ఇప్పటిదాకా 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. గత మే నెలలో పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ షహదత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.