: సైనైడ్ అమ్మి తన బిడ్డ మరణానికి కారణమైన 'అమేజాన్'ను కోర్టుకు లాగిన ప్రవాస భారతీయురాలు


ఆన్ లైన్లో సైనైడ్ గుళికలను విక్రయించడం ద్వారా తన బిడ్డ మరణానికి కారణమైందని ఆరోపిస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ పై ఓ ప్రవాస భారతీయురాలు కోర్టు కేసు వేసింది. అమేజాన్ తో పాటు తన బిడ్డ చదువుకున్న యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియానూ కోర్టుకు లాగింది. వివరాల్లోకి వెళితే, 2011 సంవత్సరంలో పెన్సిల్వేనియా వర్శిటీలో 20 సంవత్సరాల నర్సింగ్ స్టూడెంట్ పై మరో విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఈ విషయంలో తన బిడ్డపై కనీస మానవత్వం కూడా చూపలేదని, మానసిక ఒత్తిడిలో కూరుకుపోయిన తన బిడ్డ 2013లో ఆత్మహత్య చేసుకుందని కోర్టులో వేసిన పిటిషన్ లో ఆ తల్లి తెలిపింది. ఓ కిచన్ ప్రొడక్టుగా అమేజాన్ లో విక్రయానికి ఉంచిన సైనైడ్ గుళికలను ఆర్డర్ చేసి తెప్పించుకున్న తన బిడ్డ వాటిని తిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించింది. అమేజాన్ లో 2013 ఫిబ్రవరి 2వ తేదీ వరకూ సైనైడ్ ను అమ్మకానికి ఉంచారని, యూఎస్ లో 50 మంది కస్టమర్లు వాటిని ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్నారని, వీరిలో 11 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై అమేజాన్ కు శిక్ష పడాలని ఆమె కోర్టును కోరారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నందున తాము ఎటువంటి వ్యాఖ్యలూ చేయబోమని వర్శిటీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కామెంట్ చేసేందుకు అమేజాన్ ప్రతినిధులు సైతం నిరాకరించారు.

  • Loading...

More Telugu News