: దావూద్ ను ఏ క్షణంలోనైనా ఫినిష్ చేసేస్తాం!: కేంద్ర మంత్రి రాథోడ్ సంచలన వ్యాఖ్య
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ప్రకటించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాథోడ్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తన శత్రువుల పట్ల భారత్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించబోదన్న ఆయన, ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దావూద్ పనిబడతామని ఆయన పేర్కొన్నారు. కోవర్ట్ ఆపరేషన్ చేస్తే ప్రజలకు వివరాలు వెల్లడి కావని, ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్ నే చేపడతామని ఆయన ప్రకటించారు. ‘‘సామ, దాన, భేద, దండోపాయాల సంగతి తెలుసు కదా. వీటిలో కొన్నింటిని దావూద్ పై ఇప్పటికే ప్రయోగించాం. మరికొన్నింటినీ త్వరలోనే ప్రయోగిస్తాం. ఆ వార్త కూడా మీకు అందుతుంది. భారత్ తన శత్రువుల పట్ల ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించదు. 1993 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ అతడి ప్రతి కదలికపై మాకు పూర్తి సమాచారం ఉంది. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. ఏదో ఒక సందర్భంగా ఇతడి పని ముగించేస్తాం’’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు.