: సులువుగా గృహ రుణం కావాలా? అయితే, జీవిత భాగస్వామి తోడొస్తే బెటర్!


రాజేష్... సొంతింటి కలను నిజం చేసుకోవాలని గృహ రుణం కోసం ఓ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంకు రాజేష్ దరఖాస్తును తోసిపుచ్చింది. నెలవారీ తీసుకుంటున్న వేతనంతో పోలిస్తే, ఇంటి కోసం అడిగిన మొత్తం చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి జాయింట్ లోన్ ఉపయుక్తకరంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తుంటే, లేదా ఆమె ఎంతో కొంత సంపాదిస్తుంటే, ఆమెను పార్ట్ నర్ గా చేసుకుని జాయింట్ లోన్ కు అప్లయ్ చేస్తే, మరింత సులువుగా రుణం లభిస్తుంది. ఇంట్లో ఉన్న మరెవరైనా సంపాదనాపరులనూ భాగస్వామ్యం చేసుకోవచ్చు. కుటుంబ అవసరాలు, ఇంటి స్వరూపం, దాని వ్యయం బట్టి నలుగురు నుంచి ఆరుగురి వరకూ కలసి రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఎవరితో కలసి దరఖాస్తు చేయవచ్చు?: సాధారణంగా జీవిత భాగస్వామితో కలసి రుణాలు తీసుకునే వారికే బ్యాంకులు అధిక ప్రోత్సాహమిస్తుంటాయి. అయితే, తల్లిదండ్రులు, సోదరులతో కలసి వెళ్లినా కొన్ని బ్యాంకులు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారికి మాత్రం ఈ రుణాలు దూరమే. లోన్ ఎలిజబిలిటీ: జాయింట్ హోం లోన్ తీసుకుంటున్న పక్షంలో తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని లెక్కగట్టే బ్యాంకులు అందుకు తగ్గట్టుగా రుణాన్ని మంజూరు చేస్తాయి. ఉదాహరణకు రూ. 1 కోటి విలువైన ఆస్తిని కొనాలని భావిస్తే, బ్యాంకులు 80 శాతం వరకూ అంటే రూ. 80 లక్షల వరకూ రుణమిస్తాయి. ఇంత మొత్తం తిరిగి చెల్లింపు మీ వల్ల కాదేమోనని బ్యాంకులు భావిస్తే, అంతకన్నా తక్కువ ధరలో లభించే ఆస్తుల కొనుగోలుకు వెళ్లాల్సిందే. నెలసరి పొందే వేతనంలో 35 శాతం మొత్తానికి సమానమైన కిస్తీ కట్టేలా రుణ మొత్తాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. అంటే, రూ. 20 వేల జీతగాడు నెలకు రూ. 7 వేల కన్నా ఇంటి రుణం తీర్చలేడన్నది బ్యాంకుల అభిప్రాయం. అంటే, ఇతనికి ఎంచుకునే కాలపరిమితిని బట్టి సుమారు రూ. 5 నుంచి 6 లక్షల వరకూ రుణం వస్తుంది. రీ పేమెంట్ విధానం: సాధారణ రుణాల తరహాలోనే గృహ రుణాల్లోనూ రీ పేమెంట్ విధానం ఉంటుంది. ముందస్తు చెక్కులు లేదా ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) విధానంలో చెల్లింపులు జరపాల్సి వుంటుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నట్లయితే, వేతనాలు వచ్చే తేదీలను ముందే పరిశీలించి ఈసీఎస్ తేదీలను బ్యాంకుకు ఇవ్వాలి. షెడ్యూల్ ప్రకారం ఈఎంఐలు కడుతుండాలన్న విషయాన్ని మరవద్దు. ఏదైనా వివాదం వస్తే..?: జీవిత భాగస్వామి అయినా, భవిష్యత్ లో వివాదాలు రావని చెప్పలేం. అనుకోకుండా వచ్చే గొడవలు విడాకులకూ దారితీయవచ్చు. ఇటువంటి ఘటనలు జరిగితే... అందుకోసమే బ్యాంకులు రుణమిచ్చే ముందుగానే లీగల్ లయబిలిటీ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంటాయి. దీనిలో అన్ని వివరాలు సమగ్రంగా ఉంటాయి. ఏవైనా వివాదాలు తలెత్తితే, ఈ ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు రికవరీ ప్రాసెస్ మొదలు పెడతాయి. పన్ను రాయితీలు: ఇక మరో ముఖ్య విషయం, సంయుక్తంగా గృహ రుణం తీసుకుంటే, భార్యాభర్తలిద్దరూ తమ వేతనంలో కిస్తీలకు చెల్లించే మొత్తంపై పన్ను రాయితీలు పొందవచ్చు. ఒక్కొక్కరూ రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 4 లక్షల వరకూ పన్ను రాయితీలు పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షలు, సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల రాయితీలు దగ్గరవుతాయి. కాబట్టి, జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఆమెతో కలసి వెళితే సులువుగా గృహ రుణం లభించడంతో పాటు, అదనపు పన్ను రాయితీలూ దగ్గరవుతాయన్నమాట.

  • Loading...

More Telugu News