: మోదీ అంటే... మేకర్ ఆఫ్ డెవలప్ మెంట్ ఇండియా: వెంకయ్య
ప్రధానమంత్రి నరేంద్రమోదీని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన వాక్చాతుర్యంతో నిరంతరం కీర్తిస్తూనే ఉంటారు. తాజాగా ప్రధాని పేరుకు వెంకయ్య కొత్త అర్థం చెప్పారు. మోదీ (MODI) అంటే... 'మేకర్ ఆఫ్ డెవలప్ మెంట్ ఇండియా' అని అభివర్ణించారు. ఈ తాజా ప్రశంస బదల్ పూర్- ఫరీదాబాద్ మెట్రో మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకుంది. అటు ప్రధాని కూడా వెంకయ్యను ప్రశంసలతో ముంచెత్తారు. వెంకయ్య నాయకత్వంలో పలు మెట్రో ప్రాజెక్టులు అమలవుతున్నాయన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీలు) పథకానికి రూపునిచ్చి ప్రారంభించినట్టు తెలిపారు. ఆకర్షణీయ నగరాలతో ఆర్థిక పురోగతి మరింత విస్తృతమవుతుందని పేర్కొన్నారు.