: ఏపీకి ‘హోదా’ను ఆ మూడు రాష్ట్రాలే అడ్డుకుంటున్నాయి: కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు


ప్రత్యేక హోదా ప్రకటనకు ఏపీకి అన్ని అర్హతలున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజు అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సంఘమే ప్రకటించిందని కూడా ఆయన పేర్కొన్నారు. తన సొంత జిల్లా విజయనగరంలో నేటి ఉదయం ఆయన ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకు ఏపీకి అన్ని అర్హతలున్నాయని చెప్పిన ఆర్థిక సంఘమే, దేశంలో ఇక మరే రాష్ట్రానికి కూడా ‘హోదా’ను ప్రకటించరాదని కేంద్రానికి తెలిపిందని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరాదని కర్ణాటక, తమిళనాడులతో పాటు ఒడిశా కూడా కేంద్రం వద్ద వాదిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షగానే మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే దాకా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News