: ఈడీకి చుక్కెదురు... లలిత్ మోదీకి రెడ్ కార్నర్ ఎందుకని ప్రశ్నించిన ఇంటర్ పోల్
ఐపీఎల్ మాజీ చైర్మన్ ను ఇండియాకు తిరిగి రప్పించాలని భావిస్తూ రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చుక్కెదురైంది. ఆయనపై ఎందుకు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారో వెల్లడించాలని ఇంటర్ పోల్ కోరింది. ఈ మేరకు గత నెల 20న ఇంటర్ పోల్ నుంచి ఈడీకి లేఖ అందినట్టు తెలుస్తోంది. కాగా, దేశపు అత్యున్నత విచారణ సంస్థ రెడ్ కార్నర్ నోటీసు ఇస్తే, దాన్ని ప్రశ్నించే హక్కు ఇంటర్ పోల్ కు లేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. సీబీఐ సూచనల మేరకే ఈడీ ఈ నోటీసులు ఇచ్చిందని, దీన్ని లియాన్ లోని ఇంటర్ పోల్ హెడ్ క్వార్టర్స్ కు పంపామని, వారి నుంచి ఇటువంటి స్పందన వస్తుందని ఊహించలేదని తెలిపారు. కాగా, మోదీకి నోటీసులపై ఈ నెలాఖరులోగా ఇంటర్ పోల్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం లలిత్ మోదీపై 16 కేసుల్లో విచారణ జరుగుతుండగా, వాటిల్లో 15 కేసులు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) కింద నమోదయ్యాయి.