: ఐదుగురు బిడ్డలకు తిండి పెట్టలేక, సజీవ దహనం చేసుకున్న తల్లి
ఇండియాలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారుతోందో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. మహారాష్ట్రలో తీవ్ర కరవు బారినపడ్డ మరాట్వాడ రీజియన్ లోని అంబీ గ్రామంలో తన బిడ్డలకు తిండి పెట్టలేని ఓ తల్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది. మనీషా గట్కల్ అనే ఈ మహిళకు ఐదుగురు పిల్లలు. "మాది చాలా పేద కుటుంబం. తినేందుకు తిండి లేదు. చేసేందుకు పని లేదు. చిన్న పని దొరికితే వెళ్లాను. తిరిగి వచ్చే సరికి ఇంటిలోపల తలుపు గడి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది" అని మీనాక్షి భర్త లక్ష్మణ్ విలపిస్తూ తెలిపాడు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు సైతం ఆ ఇంటి పేదరికం చూసి బాధపడ్డారు. ఓ అల్యూమినియం ప్లేట్ లో రెండు చపాతీలు మాత్రం అక్కడ కనిపించాయట. ఆహార ధాన్యాలు ఉండే డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. బియ్యం, నూనెలు లేవు. అసలు తినదగ్గ పదార్థాలు ఏమీ లేదు. ప్రభుత్వం ఇచ్చే 18 కిలోల గోధుమలు, 12 కిలోల బియ్యం ఏడుగురు సభ్యులున్న కుటుంబానికి కేవలం 12 రోజులు మాత్రమే వస్తాయని, ఇక మిగతా రోజులు ఏం తినాలని స్థానికులు ప్రశ్నించారు. కాగా, మరాట్వాడ రీజియన్ లో గత సంవత్సరం 574 మంది రైతు కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకూ 628 మంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు.