: మాటిచ్చారు, తప్పొద్దు: బీసీసీఐకి పీసీబీ వేడుకోలు
పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించుకునే దిశగా గతంలో బీసీసీఐ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ దేశ క్రికెట్ బోర్డు వేడుకుంటోంది. గత సంవత్సరం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కార్యకలాపాలు, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల చేతుల్లోకి వచ్చేందుకు తాము మద్దతిచ్చామని, ఆ సమయంలో బీసీసీఐ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కోరాడు. 2015 నుంచి 2023 మధ్య ఆరు సిరీస్ లను ఆడతామని బీసీసీఐ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని, ఆ మాట నిలబెట్టుకుంటుందనే భావిస్తున్నామని ఆయన అన్నారు. కాగా, భారత్ తో ఆడేందుకు ఇలా దేబిరించడాన్ని ఆపాలని ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సలహా ఇచ్చాడు. క్రికెట్లో ప్రతిభ విషయంలో ఇండియా కన్నా పాకిస్థాన్ ఎల్లప్పుడూ ముందు నిలుస్తూనే ఉందని, భారత క్రికెట్ డబ్బుపై నడుస్తోందని ఆయన విమర్శించారు. క్రికెట్ సంబంధాలు మెరుగుపడితే సంతోషమే కానీ, దానికోసం ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.