: పొంగి పొర్లుతున్న వేదావతి నది, కర్ణాటకతో తెగిన సంబంధం!
గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లా పరిధిలోని వేదావతి నది పొంగిపొర్లుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లోని హోళగుంద మండలంలో రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల నీరు రోడ్లపై మూడు నుంచి నాలుగడుగుల మేరకు ప్రవహిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రోడ్డు కనెక్టివిటీ దెబ్బతింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోగా, పాలు, తదితర నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, కడప జిల్లా రైల్వే కోడూరులో గత రాత్రి కురిసిన వర్షానికి గోడకూలి 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. హైదరాబాదు మూసాపేటలో విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు మరణించారు. దీంతో నిన్నటి నుంచి వర్షం, పిడుగులు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 23కు పెరిగింది. ఒడిశా నుంచి తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల పిడుగులు పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.