: డబ్బు కడితేనే వైద్యమన్న ‘కామినేని’...కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు
రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య భద్రత కార్డు కూడా అతడి వద్ద ఉంది. అయినా కార్పొరేట్ ఆసుపత్రి ‘కామినేని హాస్పిటల్’ ధన దాహం ముందు అది పనికిరాలేదు. డబ్బు కడితేనే చికిత్స చేస్తానని మొండికేసింది. డబ్బు లేదన్న కానిస్టేబుల్ కు చికిత్స అందించలేనని తేల్చిచెప్పేసింది. రక్త గాయాలతో చికిత్స కోసం వచ్చిన కానిస్టేబుల్ ను తిప్పి పంపింది. వెనువెంటనే ‘కామినేని’ యాజమాన్యం ప్రతిఫలం కూడా చవిచూడాల్సి వచ్చింది. వైద్యానికి నిరాకరించిన ఆసుపత్రి యాజమాన్యంపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న యాదగిరి గత గురువారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం వెళ్లిన యాదగిరికి కామినేని యాజమాన్యం డబ్బు కడితేనే చేర్చుకుంటామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో యాదగిరి మరో ఆసుపత్రికి వెళ్లాడు. దీనిపై పోలీసు అధికారుల సంఘం సైబరాబాదు అధ్యక్షుడు భద్రారెడ్డి ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కామినేని హాస్పిటల్ యాజమాన్యం, యాదగిరిని తిప్పి పంపిన సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడు, ఇతర బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.