: టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన షేన్ వాట్సన్
మైఖేల్ క్లార్క్, కుమార సంగక్కరలాంటి క్రికెట్ దిగ్గజాల బాటలో మరో స్టార్ ప్లేయర్ నడిచాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్టు ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ప్రకటించాడు. ఇంగ్లండ్ తో రెండో వన్డే జరుగుతున్న సందర్భంగా గాయపడ్డ వాట్సన్ ఆశ్చర్యకరంగా టెస్ట్ మ్యాచ్ లకు ముగింపు పలికాడు. ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోవడమే కాకుండా, వరుసగా గాయాల బారిన పడుతుండటంతో... ఐదు రోజుల ఆటకు ముగింపు పలకడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్టు 34 ఏళ్ల వాట్సన్ తెలిపాడు. తన నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా వెల్లడించాడు. పాకిస్థాన్ పై 2005లో షేన్ వాట్సన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో మొత్తం 59 టెస్టులు ఆడిన వాట్సన్ ఒక మ్యాచ్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. మొత్తం 3,731 పరుగు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, 75 వికెట్లను కూడా పడగొట్టాడు.