: కెనడాలో వికసించిన తెలుగు తేజం శివలింగ ప్రసాద్
కెనడాలోని అల్బర్జా శాసనసభలో మొట్టమొదటి సారిగా తెలుగువ్యక్తి విజయం సాధించారు. ఈ నెల 3న జరిగిన ఎన్నికల్లో వైల్డ్ రోజ్ పార్టీ తరపున పోటీ చేసిన విజయవాడ వాసి పాండా శివలింగ ప్రసాద్ విజయం సాధించారు. శివలింగ ప్రసాద్ ది గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామం. ఉయ్యూరులోని ఏజీ అండ్ ఎస్జీ కాలేజీలో ఇంటర్ వరకూ, కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ఏపీ శాసన మండలి సభ్యులు వైబివీ రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ, మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లు ఆయనకు మంచి మిత్రులు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే స్టూడెంట్ యూనియన్ కు జరిగిన ఎన్నికల్లో రాజగోపాల్ పై విజయం సాధించారు. అనంతరం ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో 16 సంవత్సరాలు పనిచేసి, 2004లో కెనడాకు వెళ్లారు. చమురు, సహజవాయు రంగంలో విశేష అనుభవమున్న ఆయన అల్బర్టాలోని సన్ కోర్ ఎనర్జీ క్యాల్గరీ సంస్థలో మేనేజర్ గా చేరి, సీనియర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. నాలుగేళ్ల నాడు, ఆపై గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనను, ఈ దఫా విజయలక్ష్మి వరించింది. కెనడాలోని అసెంబ్లీకి ఓ తెలుగు వ్యక్తి ఎంపికవడం ఇదే తొలిసారి.