: తిరుపతిలో చిన్నారిని కిడ్నాప్ చేసిన పూజ అరెస్ట్
తిరుపతిలో సంచలనం సృష్టించిన చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన పూజ అనే యువతి, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతకుముందు, తమిళనాడులోని మేలవూరులో కిడ్నాపర్లు ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అక్కడికి ఓ బృందాన్ని పంపి పూజ దంపతులను పట్టుకున్నారు. మొత్తం 24 టీములను ఏర్పాటు చేసిన పోలీసులు, పలు ప్రాంతాలను జల్లెడపట్టి వీరిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ జరిగిన ప్రాంతానికి వెళ్లి కొత్తగా ఎవరు వచ్చారన్న కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పూజ అనే యువతి వచ్చినట్టు తెలుసుకుని, ఆమె స్వగ్రామంపై కన్నేశారు. అక్కడ పూజ ఇంట కొత్తగా ఓ బాలుడు వచ్చి చేరినట్టు పసిగట్టి దాడి జరిపారు. నిందితులను విచారిస్తున్నామని, ఈ సాయంత్రం మీడియా ముందుకు ప్రవేశపెడతామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.