: రెస్టారెంటుగా రూపాంతరం చెందిన ఎంఎఫ్ హుస్సేన్ గృహం
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో 1990 దశకంలో దివంగత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ నిర్మించుకున్న ఇల్లు ప్రస్తుతం ఓ రెస్టారెంటుగా మారిపోయింది. ఇక్కడి ఎస్.టీ బెడ్ లేఔట్ లో ఆయన ఓ డూప్లెక్స్ ఇంటిని నిర్మించుకుని అందులో చాలా కాలం పాటు ఉన్నారు. ఆ ఇంటికి 'హుస్సేన్ సంకలన' అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఎన్నో పుస్తకాల, సంగీత ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడా ఇంటిని ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న 'గోల్డ్ ఫించ్ హోటల్స్' స్వాధీనం చేసుకుంది. "ఈ స్థలాన్ని అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే స్వయంగా కల్పించుకుని ఎంఎఫ్ హుస్సేన్ కు ఇచ్చారు. 2007 వరకూ ఇక్కడే ఉన్న ఆయన, తదుపరి స్వీయ దేశాంతరవాసం చేశారు" అని గోల్డ్ ఫించ్ ఎండీ గౌరవ్ శెట్టి వివరించారు. బెదిరింపులు వచ్చిన తరువాత, దేశం విడిచి వెళ్లగా, ఆయన కుమార్తె దీన్ని అమ్మకానికి పెట్టారని తెలిపారు. దీన్ని తాము కొనుగోలు చేసి 'బంజారా మెల్టింగ్ పాట్' పేరిట రెస్టారెంట్ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ భవంతి తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నందునే కొనుగోలు చేసి కొన్ని మార్పు చేర్పులు చేసినట్టు తెలియజేశారు.