: ఘోరంగా ఓడిపోయి, భావి తరాలకు అబద్ధాలు చెబుతున్నాం: పాక్ చరిత్రకారుల ఒప్పుకోలు
"1965 నాటి యుద్ధంలో ఇండియాపై పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది" అని పాకిస్థాన్ చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుడిగా, చరిత్రకారుడిగా పేరున్న అక్బర్ ఎస్ జైదీ, "ఈ విషయం పాక్ ప్రజలకు పూర్తిగా తెలియదు, వారు చదువుకున్న చరిత్ర వేరే. వాస్తవ పాక్ చరిత్ర ఏ పాఠ్యాంశంలోనూ లేదు" అని వ్యాఖ్యానించినట్టు 'డాన్' పత్రిక వెల్లడించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పాఠ్యాంశాలు బోధించే ఆయన, 1965 నాటి యుద్ధంలో గెలిచామని పాక్ ఏటేటా సంబరాలు చేసుకుంటూ, అతిపెద్ద అబద్ధంతో ప్రజలకు అసత్యాలను నూరిపోస్తోంది. ఆ యుద్ధంలో పాక్ ఘోరంగా ఓడిపోయిందని జైదీ అన్నారు. భారత్, పాక్ మధ్య యుద్ధంలో గెలిచింది తామేనని చెబుతూ, రెండు రోజుల్లో పాక్ 'డిఫెన్స్ డే'ను జరుపుకునేందుకు రెండు రోజుల ముందుగా జైదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ గత చరిత్రను గురించి కూడా విద్యార్థులు తప్పుగా నేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. భారత ఉపఖండం నుంచి 1947, ఆగస్టు 14న పాకిస్థాన్ విడిపోగా, పాక్ క్రీస్తుశకం 712లో ఏర్పడిందని, అరబ్బులు సింధు, ముల్తాన్ ప్రాంతాలకు వచ్చి పాక్ ను ఏర్పరచారని తప్పుడు అంశాలను బోధిస్తోందని తెలిపారు. కరాచీలో విద్యాభివృద్ధి కొంతైనా ఉందంటే, అది పార్సీలు, హిందువుల పుణ్యమేనని ఆయన అన్నారు.