: వందల నుంచి పదుల్లోకి తగ్గిన 'డ్రంకెన్ డ్రైవ్' కేసులు
పీకల దాకా మందుకొట్టి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గణనీయంగా తగ్గింది. దీనివల్ల రాత్రి మరణాల సంఖ్య కూడా తగ్గిందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. హైదరాబాదులో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మొదలు పెట్టిన కొత్తల్లో రోజుకు 500 వరకూ మద్యం తాగి, వాహనాలు నడుపుతున్న వారు పట్టుబడిన సందర్భాలున్నాయి. ఇప్పుడా సంఖ్య పదుల్లోకి చేరిపోయింది. గత రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా, కేవలం 49 మంది మాత్రమే తాగి కార్లు, బైకులు నడుపుతూ పట్టుబడ్డారు. బేగంపేటలో అత్యధికంగా 12 మంది పోలీసులకు చిక్కగా, మిగతా ప్రాంతాల్లో ఎక్కడా ఈ సంఖ్య రెండంకెలకు చేరలేదు. ఇది శుభపరిణామమని, తాము తనిఖీలు చేపడితే, ఒక్కరూ పట్టుబడని రోజు కోసం ఎదురుచూస్తున్నామని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్న విషయమై ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందని వివరించారు.