: రూపాయికే సిగరెట్... జోరుగా సాగుతున్న అక్రమ దందా!


ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, డ్రగ్స్... ఇలా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించకుండా విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అయి వచ్చే వస్తువుల జాబితాలోకి ఇప్పుడు సిగరెట్లు కూడా చేరిపోయాయి. అరబ్ దేశాల నుంచి దిగుమతి అయ్యే సిగరెట్లు ఇప్పటికే మార్కెట్లలో ఉండగా, వాటి ఖరీదు కాస్తంత ఎక్కువే. అయితే, ఇప్పుడో కొత్త రకం దందా మొదలైంది. చౌక సిగరెట్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. బంగ్లాదేశ్, మలేషియాల్లో తయారయి అక్రమంగా దేశంలోకి వచ్చే వీటి ఖరీదెంతో తెలుసా? ఒక్కో సిగరెట్ ఒక్క రూపాయి మాత్రమే! వీటి పొగ కూడా ఘాటుగానే ఉంటుంది. పేదలు, కూలీలు, కార్మికులను లక్ష్యం చేసుకుంటున్న అక్రమార్కులు ప్రభుత్వాలకు పన్నులు చెల్లించకుండా వీటిని పాన్ డబ్బాలకు తరలిస్తున్నారు. వీటికి డిమాండ్ అధికంగా ఉండటంతో వ్యాపారులు దొంగ మార్గాల దారిన నడుస్తున్నారు. బంగ్లాదేశ్, మలేషియా దేశాల నుంచి కోల్ కతా మీదుగా ఇండియాలోకి వచ్చే సిగరెట్లు దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలకే కాదు, మారుమూల పల్లెలకూ చేరిపోతున్నాయి. వాణిజ్యపన్నుల శాఖ తాజాగా నిర్వహించిన దాడులతో సిగరెట్ దందా వెలుగులోకి వచ్చింది. ఇదిలావుండగా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో తయారవుతున్న అక్రమ సిగరెట్లను కూడా పలు కంపెనీలు పన్నులు చెల్లించకుండా తక్కువ ధరలకు అమ్ముకుంటున్నాయి. చాలాసార్లు దాడుల్లో ఈ కంపెనీలు పట్టుబడినా, నామమాత్రంగా కేసులు వేసి, జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ సిగరెట్ల దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News