: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలపై కేసీఆర్ కఠినంగా వ్యవహరించాలి: డీకే అరుణ్ డిమాండ్
కాంగ్రెస్ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రజలందరూ అసహ్యించుకునేలా, వీధి రౌడీలా అచ్చంపేట ఎమ్మెల్యే వ్యవహరించారని ఆమె మండిపడ్డారు. దాడులతో ప్రతిపక్ష సభ్యులను భయపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల దౌర్జన్యాలను, దాడులను ఇలాగే ప్రోత్సహిస్తే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా గద్వాల్ లో ఈరోజు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి అరుణ మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలతో పాటు రౌడీ ఇజాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.