: విజయవాడ మెట్రో రైలుపై వెనక్కి తగ్గలేదు: వెంకయ్యనాయుడు
విజయవాడ మెట్రో రైలు సాధ్యం కాదంటూ గత నెలలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విజయవాడ మెట్రోపై కేంద్రం వెనక్కి తగ్గలేదని, సానుకూలంగానే ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. డీపీఆర్ (విజయవాడ జనాభా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రాగానే నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య ఏపీకి సంబంధించిన పలు విషయాలను వివరించారు. విజయవాడ దుర్గగుడిపై వంతెనకు రూ.330 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను కోరామన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఏపీపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలపై నీతి అయోగ్ సమాలోచనలు చేస్తోందని చెప్పిన వెంకయ్య, ఏపీ ప్రత్యేక హోదా సీరియస్ అంశమని పేర్కొన్నారు. రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు అవలంభిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని వెంకయ్య విమర్శించారు. నెల్లూరు జిల్లా దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిదని, స్థల సేకరణ పూర్తయితే వెంటనే పనులు మొదలుపెడతారని చెప్పారు. అంతేగాక నెల్లూరు-చిత్తూరు రహదారిని 4 లైన్లుగా మార్చేందుకు సర్వే చేస్తున్నట్టు చెప్పారు. ఇక విశాఖ మెట్రో విషయంలో కూడా కేంద్రం వెనకడుగు వేయలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఎవరూ భావావేశాలకు లోనుకావద్దని సూచించారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయ వివాదం చేయొద్దన్న వెంకయ్య, గతేడాదిగా రాష్ట్రానికి కేంద్రం సాయంపై త్వరలో నివేదిక ఇస్తానని చెప్పారు.